అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా–రష్యా వాణిజ్య సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పరిపాలనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20 శాతం మేర పెరిగిందని ఆయన వెల్లడించారు.
“ఇది కేవలం గణాంకాలే అయినప్పటికీ వాస్తవానికి వాణిజ్యం వృద్ధి చెందింది. ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి రంగాల్లో అపారమైన సహకార అవకాశాలు ఉన్నాయి” అని పుతిన్ తెలిపారు.
ఇక భారత్‌పై సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిలో మార్పు చూపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ‘సెకండరీ టారిఫ్‌లు’ తప్పనిసరి కాకపోవచ్చని ఆయన సంకేతాలిచ్చారు. ముందుగా ప్రకటించిన ప్రకారం 25 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, అవసరం అనిపిస్తేనే టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ వంటి పెద్ద చమురు క్లయింట్ రష్యా నుంచి తప్పుకోవడం పెద్ద నష్టమేనని, కానీ అమెరికా–రష్యా ఆర్థిక సహకారం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఆయన సూచించారు.
ఇటీవలే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, పుతిన్–ట్రంప్ సమావేశం విఫలం అయితే భారత్‌పై సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే.