ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం శుభారంభం!ఆగస్టు 15 సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులు చూపిస్తే మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఐదు రకాల బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు జారీ అవుతున్నాయి: పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్. ఈ టికెట్లలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారో, ఎంత లాభం పొందారో వివరాలు ఉంటాయి.
అంబాజీపేట నుంచి విజయవాడకు వచ్చిన ఒక కుటుంబం (ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు) ఒక్కరోజే రూ.1160 లబ్ధి పొందింది. రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా ప్రయాణించామని ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయాన్ని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
స్త్రీ శక్తి పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 11,449 బస్సుల్లో 8,458 బస్సులు కేటాయించారు. త్వరలోనే రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు.
అయితే, మహిళల ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి ₹10,000 ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనపై ఆలోచిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.