ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్‌లను ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా బస్టాండ్లను పరిశీలిస్తూ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకిలో కొత్త ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే రెండు మూడు ఏళ్లలో అత్యాధునిక సదుపాయాలతో ఈ బస్టాండ్ నిర్మాణం పూర్తి కానుంది.
అద్దంకి బస్టాండ్‌ను పరిశీలించిన ద్వారకా తిరుమలరావు, గ్యారేజీలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్మికులను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ, బస్టాండ్ పరిసర ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను ముందుగా కట్టి, వెనుక వైపు బస్టాండ్‌ను నిర్మించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. దీని వలన ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని, ప్రయాణికులకూ మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా "స్త్రీశక్తి పథకం" విజయవంతంగా అమలవుతుండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తిరుమలరావు తెలిపారు. గతంలో 40% మంది మహిళలు ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 65%కి పెరిగిందన్నారు. మరిన్ని బస్సుల్లో ఈ పథకాన్ని విస్తరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
ఇక ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో 2,550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త బస్సులు రాకముందు ఉన్న బస్సులతోనే ఎక్కువ ట్రిప్పులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల మెయింటినెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టికెట్ లేని ఆదాయాన్ని పెంచే చర్యలు కూడా చేపడుతున్నారు.
కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తిరుమలరావు స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి ఇప్పటికే 1,200 మంది కార్మికులను రక్షించగలిగామని అధికారులు తెలిపారు. స్త్రీశక్తి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, బస్సులపై ఒత్తిడి పెరిగిందని, ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఆర్టీసీ లాభాలు పెంచే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.