రేషన్ కార్డు దారులకు కీలక గడువు
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి ప్రభుత్వం స్పష్టమైన గడువు పెట్టింది. సెప్టెంబర్ 25లోపు తమ కార్డు వివరాలను అప్‌డేట్ చేయకపోతే, వచ్చే నెల అక్టోబర్‌లో బియ్యం అందదు. అంటే కార్డు ఉన్నా.. అప్‌డేట్ చేయకపోతే రేషన్ ఇవ్వరన్న మాట. ఈ నియమం రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుదారులందరికీ వర్తిస్తుంది.
అప్‌డేట్ ఆలస్యమైతే సమస్యలు
ఇప్పటికే సూర్యాపేటలో ఒక మహిళకు కార్డు వచ్చినా అప్‌డేట్ జరగకపోవడంతో రేషన్ అందకపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అధికారులు స్పందించి ఆగస్టు 25లోపు అప్‌డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్‌లో రేషన్ ఇచ్చామని, ఇకపై అక్టోబర్ సరఫరా కావాలంటే తప్పనిసరిగా సెప్టెంబర్ 25లోపు అప్‌డేట్ పూర్తి చేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఏఎస్‌వో స్థాయిలో జరుగుతుంది.
ప్రభుత్వ ప్రణాళికలు, సాంకేతిక ఇబ్బందులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల మంజూరు వేగం పెరిగింది. జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినా, కొత్త కార్డులు పొందిన వారిలో కొందరికి మాత్రమే లభించాయి. జూలై–ఆగస్టులో దరఖాస్తు చేసినవారికి సెప్టెంబర్ నుండి బియ్యం అందించాలని అధికారులు ప్రణాళిక చేసినా.. సాంకేతిక సమస్యల కారణంగా అప్‌డేట్ జరగకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ-కేవైసీ తప్పనిసరి
ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక కీలక సూచన చేసింది. కొత్త కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులందరిని సమీప రేషన్ దుకాణానికి తీసుకెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించాలి. ఆధార్ అనుసంధానం వల్ల బినామీలకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. గడువులు పొడిగించినా ఇంకా చాలా మంది కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్డులు రద్దు అయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.