మహారాష్ట్రలోని నాగ్పూర్ – ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వే దేశంలో నే అత్యంత ఆధునిక రహదారులలో ఒకటిగా నిలుస్తోంది. అయితే తాజాగా ఈ రహదారి ఒక సంఘటన కారణంగా చర్చనీయాంశమైంది. రోడ్డుపై వందల కొద్దీ మేకులు కొట్టడంతో వాహనాలు పంక్చర్ అవ్వడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది.
నిన్న రాత్రి ఈ ఎక్స్ప్రెస్వే మీద ప్రయాణిస్తున్న వాహనదారులు అకస్మాత్తుగా టయర్లు పంక్చర్ అవ్వడంతో భయాందోళనలకు గురయ్యారు. వందల కొద్దీ మేకులు రోడ్డుపై ఉండటం చూసిన వారు ఇది దొంగల పనేనని అనుమానించారు. “వాహనాలు ఆగిపోతే దాడి చేస్తారని భయపడ్డాం” అని కొందరు డ్రైవర్లు పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఇది ఎవరైనా దొంగల పని అయి ఉంటుందని భావించారు. కానీ విచారణలో షాకింగ్ ఫాక్ట్ బయటపడింది. రోడ్డుపై మేకులు వేసింది దొంగలు కాదని, రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని తేలింది.
దీనిపై స్పందించిన రోడ్డు నిర్మాణ సంస్థ, “మేము రోడ్డు మరమ్మతుల్లో భాగంగా మేకులు ఉపయోగించాల్సి వచ్చింది. అవి వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ముందుగా ఊహించలేదు” అని తెలిపింది. అయితే, ఇలాంటి పనులు చేస్తే ముందుగానే సూచిక బోర్డులు పెట్టడం తప్పనిసరి. కానీ ఈసారి జాగ్రత్త తీసుకోకపోవడం వాహనదారుల కోపానికి కారణమైంది.
ప్రయాణికులు, వాహనదారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై మేకులు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కంపెనీ నిర్లక్ష్యం మాపై ముప్పుగా మారింది” అన్నారు. పంక్చర్ అయిన వాహనాలు రాత్రి రోడ్డుమధ్య ఆగిపోవడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఎక్స్ప్రెస్వేలు నిర్మించేటప్పుడు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని నిపుణులు అంటున్నారు. “రోడ్డు మీద చిన్న రాయి పడినా ప్రమాదం జరుగుతుంది. అలాంటప్పుడు వందల కొద్దీ మేకులు ఉంటే ప్రమాదం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవాలి” అని ఒక రోడ్డు భద్రతా నిపుణుడు వ్యాఖ్యానించారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. భవిష్యత్‌లో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ సంస్థలపై కఠిన నిబంధనలు విధించాలని వారు కోరుతున్నారు.
నాగ్పూర్ – ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వే దేశానికి ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. కానీ ఇలాంటి ఘటనలు జరగడం వాహనదారుల్లో భయం, ఆందోళన పెంచుతోంది. రోడ్డు భద్రత అంటే కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ కాదు, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాలను నివారించడం కూడా. ఈ ఘటనతో అధికారులు పాఠం నేర్చుకుని, ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.