యువతరం ఆలోచనా ధోరణి, ముఖ్యంగా వారి ఖర్చుల విధానం (Spending Habits) ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. "నెలకు రూ. 2 లక్షల జీతం, కానీ చేతిలో రూ. 80 లక్షల మెర్సిడెస్ బెంజ్ కారు తాళం" అనే విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ప్రస్తుతం కొంతమంది యువ నిపుణులు అనుసరిస్తున్న కొత్త ట్రెండ్.
తమ ఆదాయానికి మించిన విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ, ఆర్థికంగా తీవ్రమైన రిస్క్ తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు భారీగా వైరల్ అవుతోంది.
ఈ చర్చకు కారణమైన రెడిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల ఆయన ఒక మెర్సిడెస్ షోరూమ్‌కు వెళ్లారట. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పిన విషయాలు విని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.
వేతనం vs కొనుగోలు: "నెలకు రూ. 1.4 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు జీతం తీసుకునే వాళ్లు కూడా రూ. 60-80 లక్షల విలువైన కార్లను కొంటున్నారు," అని సేల్స్ సిబ్బంది చెప్పారట. ఈ కొనుగోలుదారులు కేవలం రూ. 7-9 లక్షల డౌన్‌పేమెంట్ మాత్రమే చెల్లించి, మిగిలిన భారీ మొత్తానికి లోన్ తీసుకుంటున్నారట. వారికి లోన్లు ఇప్పించడానికి తాము చాలా కష్టపడాల్సి వస్తోందని సేల్స్ సిబ్బంది చెప్పడం ఈ పోస్ట్‌లోని కీలక అంశం.
దీని అర్థం ఏంటంటే, సగటు నెల జీతంలో సింహభాగాన్ని లేదా సగం భాగాన్ని ఏడేళ్ల పాటు కేవలం EMI (ఈఎంఐ) కోసమే చెల్లించాల్సి వస్తుంది. ఈ తరహా ఆర్థిక ప్రణాళికపై రెడిట్ యూజర్ తన తీవ్రమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సమాజంలో గొప్పగా కనిపించడం (Social Status) కోసం ఏడేళ్ల పాటు అప్పుల బానిసత్వంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. "ఇది ఆశయం (Ambition) కాదు, 'ఆర్థికంగా స్వీయ విధ్వంసం (Financial Self-Destruction) చేసుకోవడమే'"నని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పోస్ట్‌కు అదనంగా, మరొక యూజర్ పంచుకున్న అనుభవం ఈ ట్రెండ్ కేవలం కార్లకే పరిమితం కాదని "మా ఇంట్లో పనిచేసే ఆవిడ కొడుకు జీతం రూ. 20 వేలు. మొదటి నెలలోనే రూ. 15 వేలు డౌన్‌పేమెంట్ కట్టి రూ. 2.2 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. ఇంట్లో కనీసం ఫ్రిజ్ కూడా లేదు," అని పేర్కొనడం ఈ ఆడంబరాల మోజు స్థాయిని తెలియజేస్తోంది.
ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఈ ట్రెండ్‌ను ఖండించగా, మరికొందరు దీనికి సానుకూలంగా స్పందించారు. కొందరు యూజర్లు దీనిని "కస్టమర్లను ఆకర్షించడానికి లగ్జరీ బ్రాండ్లు ఉపయోగించే ఒకరకమైన సేల్స్ టెక్నిక్" అని కొట్టిపారేశారు. అప్పుల ఊబిలో ఉన్నా, లోన్ ఇచ్చి తమ ప్రొడక్టులను అమ్మెందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తాయని అన్నారు.
సానుకూల వాదన: ఇంకొందరు మాత్రం భిన్నంగా ఆలోచించారు. "అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారికి సొంత ఇల్లు ఉండి, ఇతర అప్పులు లేకపోతే నెలకు రూ. 40-50 వేల ఈఎంఐ చెల్లించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు," అని అభిప్రాయపడ్డారు. తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని వాదించారు.
మొత్తంమీద, ఈ చర్చ సామాజిక హోదా కోసం ఆర్థిక ప్రణాళిక లేకుండా యువత తీసుకుంటున్న నిర్ణయాలపై కచ్చితంగా ఒక పెద్ద ఆలోచనను రేకెత్తించింది. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, తక్షణ సంతృప్తి (Instant Gratification) కోసం ఆరాటపడటం వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.