ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఘర్షణలకు చివరిరోజు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటించారు. ఆయన ఈ నిర్ణయాన్ని చారిత్రక సమయం గా పేర్కొంటూ పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ యుద్ధం ముగిసింది. ఇది కొత్త ఆరంభం. యూదులు, ముస్లింలు, అరబ్బులు ఒకే వేదికపై నిలబడ్డారు ఇది ప్రపంచానికి శాంతి సందేశం అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం దానికి ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు
ట్రంప్ పేర్కొన్నట్లుగా ఇరు పక్షాలు ఇప్పుడు శాంతి మార్గంలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించిందని, ఈ ఒప్పందం అక్కడి ప్రజలకు ఊరటనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ ముందుగా ఇజ్రాయెల్‌కి చేరుకుని పార్లమెంటులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బందీల కుటుంబాలను కలుసుకుని వారికి భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ నగరంలో జరుగుతున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సదస్సులో ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరుగనున్నాయి. ఈ చారిత్రక కార్యక్రమానికి 20 దేశాల నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులుహాజరుకానున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ ఆతిథ్యం వహిస్తున్నారు.
భారతదేశానికి కూడా ఆహ్వానం అందగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానంలో కేంద్ర మంత్రి కేవీ సింగ్ భారత ప్రతినిధిగా పాల్గొననున్నారు.
ట్రంప్ చొరవతో కుదిరిన ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కొత్త దశగా మారవచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నాళ్లుగానో యుద్ధం భారంతో అలసిపోయిన గాజా ప్రజలకు ఈ ఒప్పందం నూతన శాంతి ప్రారంభం గా భావిస్తున్నారు