కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, కొంతమంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో నాపై చెడు రాతలు రాస్తున్నారు. అయితే, నేను అలాంటి విమర్శలకు పెద్దగా స్పందించను" అని చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఒక నాయకుడు తనపై అనవసరంగా విమర్శలు చేశారని, ఆ తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళ ఆయన్ను అడ్డుకుని నిలదీసిందని చెప్పారు. ఆ వీడియోను తాను చూశానని, ఆ మహిళ తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అంది, ప్రాణాలు నిలిచిందని తెలిసిందన్నారు.
అందుకే ఆమెకు తనపై అంత గౌరవం ఉందని చెప్పారు. తనపై చెడుగా మాట్లాడేవారికి, రాసేవారికి తాను చేసే మంచే సమాధానమని చిరంజీవి అన్నారు. "మంచి చేస్తూ, మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే నాకు తెలుసు" అని పేర్కొన్నారు.
అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని, అందుకే సోషల్ మీడియాలోని విమర్శలకు తాను స్పందించనని ఆయన తెలిపారు. తనలో బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచనను ప్రేరేపించిన ఒక జర్నలిస్ట్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా చిరంజీవి వెల్లడించారు.
రాజకీయ వర్గాల్లో చర్చ:
కాగా, చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవలే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది.
గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా చిరంజీవి పని చేశారు. ఆయనకు ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే, తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.