టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలలో 12,200 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది సంస్థలో మొత్తం ఉద్యోగుల సుమారు 2%కి సరిపోతుంది. టీసీఎస్ ఈ ఉద్యోగాలు తొలగించడాన్ని నైపుణ్యాల లోపం కారణంగా చెప్పినా, పరిశ్రమ నిపుణులు ఈ చర్యను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవ మార్పుల ప్రథమ సంకేతంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం పెద్ద బృందాలు నిర్వహించే సాధారణ కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ వంటి పనులను ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్ చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అంచనా ప్రకారం, వచ్చే 2-3 సంవత్సరాల్లో భారత ఐటీ రంగంలో 4 నుండి 5 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి.
ఉద్యోగ కోతలలో ముఖ్యంగా 13 నుంచి 25 సంవత్సరాల అనుభవం ఉన్న 4,30,000 మంది నిపుణులు ప్రభావితులు అవుతారని, వీరిలో సాంకేతిక నైపుణ్యం తక్కువగా ఉన్న టీమ్ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్ టెస్టర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ సిబ్బంది అధిక సంఖ్యలో ఉన్నారని సూచిస్తున్నారు. ఉద్యోగ కోతల ప్రభావం ఎక్కువగా 4 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్నవారిపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత జీడీపీలో ఐటీ రంగం 7% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ రంగంలో భారీ ఉద్యోగ కోతలు, పెట్టుబడుల తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
టీసీఎస్ ప్రస్తుతం ఏఐలో పెట్టుబడులు పెంచుతూ కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోంది. అయితే, మధ్యస్థాయి ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలు పొందడంలో కష్టపడతారని, మార్కెట్ ఇప్పుడు అధునాతన డిజిటల్, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారినే కోరుకుంటుందని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ వెల్లడించారు.