రష్యా తూర్పు తీరంలోని కమ్చత్కా ద్వీపకల్పంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకటించింది. ఈ శక్తివంతమైన ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే తీర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
యూఎస్‌జీఎస్ వివరాల ప్రకారం, కమ్చత్కా పరిపాలనా కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీకి తూర్పున సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో కదలికలతో సునామీ ముప్పు పెరిగే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టంచేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలు ప్రత్యేకంగా ప్రభావితమయ్యే ప్రమాదముందని సూచించింది.
ప్రారంభ అంచనాల్లో భూకంప తీవ్రతను 7.5గా నమోదు చేసిన యూఎస్‌జీఎస్, తరువాత దానిని 7.4కు సవరించింది. స్థానిక అధికారులు తీర ప్రాంత గ్రామాలు, పట్టణాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ పెరగడంతో ప్రజల్లో ఆందోళన మరింతగా పెరిగింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత జూలైలో కూడా ఇదే కమ్చత్కా ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ సమయంలో పసిఫిక్ సముద్రం అంతటా సునామీ అలలు విరుచుకుపడి, హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజా భూకంపం మళ్లీ అదే భయాందోళనను రేకెత్తిస్తోంది.