ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి ప్రాంతంలో నౌకాదళ ఆయుధాగారం (Naval Armament Depot) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఏలూరు జిల్లాకు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా కొత్త ఊపును తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు కోసం మొత్తం 1,166 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రిరెడ్డి సమక్షంలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ఎంపీ ప్రకటించారు. భూమి సేకరణకు ఐటీడీఏ సహకారంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
నేవీ అధికారులు వివరించగా, ఈ కేంద్రంలో ఆయుధాల తయారీ జరగదని, కేవలం నిల్వ మాత్రమే జరుగుతుందని చెప్పారు. అందువల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టంచేశారు. భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు మొదలు పెడతామని, పదేళ్లలో ఆయుధ నిల్వ కేంద్రం, ఉద్యోగుల క్వార్టర్లు పూర్తవుతాయని తెలిపారు.
భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు పర్యటనలు చేస్తున్నారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులకు వివరాలు చెబుతున్నారు. భూమి ఇచ్చే వారికి తగిన నష్టపరిహారం చెల్లింపుపై కూడా చర్చ జరిగింది. దీని ద్వారా స్థానిక ప్రజలు కూడా లాభపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏలూరు జిల్లా వ్యూహాత్మకంగా కీలక ప్రాధాన్యం సంతరించుకోనుంది. కేంద్ర నిధులతో నేవీ ప్రాజెక్టు రావడం వల్ల ప్రాంతానికి కొత్త అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి దిశగా పెద్ద అడుగులు పడతాయి. దీంతో జీలుగుమిల్లి మాత్రమే కాదు, మొత్తం జిల్లాకే ఇది ఒక మైలురాయి ప్రాజెక్టుగా నిలుస్తుందని అంచనా.