ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ఆధార్ లింకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. అక్టోబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మొదటగా ప్రతి రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేయగా, ఏపీలో కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రస్తుతం జాబ్ కార్డు ఒకరి పేరుతో ఉన్నప్పటికీ, పనికి మరొకరు వచ్చి హాజరు నమోదు చేసుకునే దారుణం విస్తృతంగా జరుగుతోంది. ఫలితంగా నిజమైన లబ్ధిదారులకు కాకుండా మధ్యవర్తులు, సిబ్బంది లాభపడుతున్నారు. ఈకేవైసీ విధానం ద్వారా పని చేయడానికి వచ్చే వ్యక్తి ఆధార్ వివరాలను నేరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఒకరి బదులు మరొకరు పనిచేయడం అసాధ్యం అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.73 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. అయితే వీటిలో అనేక కార్డులు వాడుకలో లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. కొంతమంది జాబ్ కార్డు ఉన్నవారు పనికి రావడం లేదని, వారి బదులు ఇతరులు హాజరు వేసుకుని డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త వ్యవస్థతో అటువంటి అవినీతి, దోపిడీకి తావు ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఇకపై ఉపాధి పనులకు హాజరయ్యే ప్రతి కూలీ తన ఆధార్ లింక్ చేసిన ఈకేవైసీతో మాత్రమే పనిచేయగలడు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కఠిన చర్యలతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన కూలీలకు మాత్రమే వేతనాలు చేరుతాయని అధికారులు నమ్ముతున్నారు. ఈకేవైసీ అమలు వల్ల ఉపాధి హామీ పనుల్లో అవినీతి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.