ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు శుభవార్త చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనుందని ఆయన ప్రకటించారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యానికి కేవలం 24 గంటల్లోనే డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు గుర్తు చేశారు.
గత సీజన్‌లో ప్రభుత్వం 35.94 లక్షల టన్నుల ధాన్యం కొని రూ.8,282 కోట్లు చెల్లించిందని మంత్రి తెలిపారు. ఈసారి అదనంగా 15 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని, దీని కోసం రూ.3,570 కోట్లు కేటాయించామని చెప్పారు. మొత్తంగా ఈసారి ధాన్యం కొనుగోలుకు రూ.11,582 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారం ముందుగానే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయించిన ధర ప్రకారం, కామన్ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి రూ.2,389 చెల్లిస్తామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా “మనమిత్ర” వాట్సాప్ గ్రూప్ ద్వారా మిల్లులకు నేరుగా ధాన్యం అమ్ముకోవచ్చని సూచించారు.
పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాలకు సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా తెలిపారు. దీపం పథకం కింద ఇప్పటివరకు 2.42 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని, మూడో విడత సిలిండర్ పొందడానికి నవంబర్ వరకు అవకాశం ఉందని చెప్పారు.
కాకినాడలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కేవలం 29 లక్షల టన్నులే కొనుగోలు చేసి, రూ.1,674 కోట్ల బకాయిలు పెట్టిందని.. ఆ బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.