హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయం అకస్మాత్తుగా మంటల బారిన పడటంతో ప్రాంతం మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ కార్యాలయంలో లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చి స్థానికులను ధైర్యం చెప్పారు.
అగ్నిప్రమాదం సమయంలో భవనం అంతస్తు నుంచి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. కొద్ది సేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. సిబ్బంది సమయానికి స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించగలిగారు.
ప్రాథమిక విచారణలో భాగంగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీలోని ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటల్లో కంపెనీకి చెందిన కంప్యూటర్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అయితే ఆస్తి నష్టంపై ఇంకా ఖచ్చితమైన అంచనా రాలేదు.
ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటనతో మాదాపూర్ ఐటీ హబ్‌లో మరోసారి అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.