దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు కారిడార్ సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రారంభమైంది. హైదరాబాద్–చెన్నై మార్గంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటలు పడుతుండగా, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలు, ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలు, భూసేకరణ అవసరాలు వంటి అంశాలను గుర్తించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ RITES విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తోంది. అనంతరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇదే సంస్థ రూపొందించనుంది. ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే, దక్షిణ భారతదేశ రవాణా రంగానికి కొత్త దిశ లభించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సర్వే దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలను కలుపుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలు బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో భాగమవుతాయని ఆయన తెలిపారు. ఈ నాలుగు నగరాల పరిధిలోనే 5 కోట్లకు పైగా జనాభా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధి, వ్యాపార విస్తరణ, కనెక్టివిటీ పెంపుకు గణనీయంగా తోడ్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇక దేశవ్యాప్తంగా అనేక బుల్లెట్ రైలు మార్గాలను ప్రణాళికలోకి తీసుకువచ్చిందని రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటికే జాతీయ రైలు ప్రణాళికలో ఢిల్లీ–వారణాసి, ఢిల్లీ–అహ్మదాబాద్, ముంబై–నాగ్‌పూర్, ముంబై–హైదరాబాద్, చెన్నై–మైసూరు, ఢిల్లీ–అమృత్‌సర్, వారణాసి–హౌరా వంటి పలు మార్గాలను ప్రస్తావించారు. ఇవి అమలులోకి వస్తే భారత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.