రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి హస్తినకు బయలుదేరి, రేపు ఆరుగురు కీలక కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులకు వేగం చేకూర్చడం, కొత్త ప్రతిపాదనలు సమర్పించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
సోమవారం జరిగే సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో లోకేశ్ భేటీ కానున్నారు. అదేవిధంగా, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు-జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌లతో కూడా చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయన కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు.
అంతేకాక, ఇటీవల రాష్ట్రానికి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా మంత్రి లోకేశ్ నిరంతరం కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.