వైఎస్ షర్మిల (YS Sharmila) మాట్లాడుతూ, తెరవెనుక పొత్తులకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని తీవ్రంగా ఆరోపించారు. ఇటీవల హాట్ లైన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె విడ్డూరంగా అభివర్ణించారు. "ప్రజల మీద కార్లు ఎక్కించి బలప్రదర్శన యాత్రలు చేయడం రాహుల్ గాంధీకి తెలియదు" అంటూ జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీజేపీతో జగన్ స్నేహంపై విమర్శలు…
షర్మిల తన ప్రసంగంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే, నరేంద్ర మోదీ, అమిత్ షాతో జగన్‌కు 'హాట్ లైన్ టచ్' ఉందని విమర్శించారు. " ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్‌కు హాట్ లైన్ టచ్ లేదని మేము నిరూపిస్తాం, జగన్‌కు దమ్ముంటే మా సవాలును స్వీకరించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. జగన్ తీరు పచ్చ కామెర్లు సోకిన వారిలా ఉందని, అందుకే అందరూ అలాగే కనిపిస్తారని షర్మిల ఎద్దేవా చేశారు. తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయిన సొంత పార్టీ నేతలను పరామర్శించడానికి రాహుల్ గాంధీ జగన్‌లా వెళ్లరని ఆమె పేర్కొన్నారు.
నీతి మాలిన రాజకీయం…
జగన్ చేస్తున్నది నీతి మాలిన రాజకీయం అని షర్మిల మండిపడ్డారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టారని, బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మాణిక్యం ఠాగూర్ గురించి అనుచితంగా మాట్లాడి జగన్‌కు సభ్యత, సంస్కారం లేదని నిరూపించుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాణిక్యం ఠాగూర్ చేసిన సవాల్‌పై జగన్ స్పందించకపోవడం ఆయనకు దమ్ము లేదని అర్థమవుతోందన్నారు. "జగన్ మోదీకి హాట్ లైన్‌లో ఉన్నాడు కాబట్టే మేము అతన్ని దత్తపుత్రుడు అన్నాం. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రశ్నించాలి" అని షర్మిల సవాల్ విసిరారు.
దేశ భవిష్యత్తు కోసం రాహుల్ పోరాటం…
ఓటు చోరీపై పార్లమెంట్‌లో వివాదం జరుగుతున్నా జగన్ నోరు మెదపకపోవడం పట్ల షర్మిల తీవ్రంగా విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే, జగన్ మోదీకి మద్దతు ఇస్తున్నట్లు మాట్లాడతారని దుయ్యబట్టారు. "మీదో పార్టీ, మీరొక నాయకుడు" అంటూ జగన్‌పై షర్మిల విమర్శల వర్షం కురిపించారు.