ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రత్యేకంగా సింహాచలం అప్పన్న ఆలయానికి వచ్చే మహిళా భక్తులకూ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఆర్టీసీ అధికారులు మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణానికి పాన్ కార్డు చెల్లదని వారు స్పష్టం చేశారు. కారణం, పాన్ కార్డులో అడ్రస్ ఉంటుందని బస్సు అధికారులకు నిర్ధారించలేమట. దీంతో, మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పత్రాలతోనే ఉచిత ప్రయాణం పొందవచ్చని సూచించారు. సీనియర్ సిటిజన్ కార్పొరేషన్, ఇతర కేంద్ర, రాష్ట్ర గుర్తింపు పత్రాలు కూడా ఈ పథకంలో వినియోగించవచ్చని అధికారులు తెలిపారు.
స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల నెలవారీ బస్ పాసులు తీసుకుంటూ విద్యార్థినులు, ఉద్యోగినులు, వ్యాపార మహిళలు డబ్బు ఆదా చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని మహిళలకు ప్రయాణ సౌకర్యం మాత్రమే కాక, ఆర్థిక సహాయం కూడా లభిస్తోంది.