జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ (62) అనారోగ్యంతో శుక్రవారం, ఆగస్ట్ 15న మరణించారు. న్యూఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయంలో ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వెల్లడించారు. ఆగస్ట్ 2న రాందాస్ తన నివాసంలోని బాత్రూమ్‌లో జారిపడ్డారు.
మెదడుకు తీవ్ర గాయం, రక్తస్రావం సమస్యలు ఎదుర్కొన్న ఆయనను అత్యవసరంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన రాందాస్ సోరెన్ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. జార్ఖండ్ ప్రభుత్వం ఆయన మరణాన్ని సంతాపంగా గుర్తిస్తూ ఒక రోజు శ్రద్ధాంజలి దినంగా ప్రకటించింది.
సోరెన్ రాజకీయ ప్రస్థానం కూడా ప్రత్యేకం. 1963 జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లా ఘోరబంద గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన సోరెన్, ఘోరబంద పంచాయతీ అధ్యక్షుడుగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1990లో JMM పార్టీకి జంషెడ్‌పూర్ అధ్యక్షుడయ్యారు.
2009లో ఘట్షిల్ నుంచి జార్ఖండ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఓటమి పాలయ్యారు, 2019లో తిరిగి గెలుపొందారు. 2024లో మూడోసారి విజయం సాధించి హేమంత్ సొరెన్ నేతృత్వంలోని కేబినెట్లో విద్యా, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
సోరెన్ మృతిపై రాజకీయ నేతలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల సమావేశంలో అనారోగ్య కారణంగా ఆయన విద్యా, అక్షరాస్యత బాధ్యతలను సుదివ్య కుమార్ సోనుకు అప్పగించారు. సోరెన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జార్ఖండ్ రాజకీయాల్లో ఆయన మృతి భారీ విషాదం సృష్టించింది.