హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాలు పెరిగి 77వ స్థానానికి చేరుకుంది. 2024లో భారత్ 85వ స్థానంలో ఉండగా ఇప్పుడు మెరుగైన స్థాయికి చేరింది. గత 10 ఏళ్లలో ఇది 11 స్థానాలు పెరిగింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు 59 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్‌తో వెళ్లవచ్చు. గత ఏడాది ఈ సంఖ్య 57 మాత్రమే.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌ది, దీతో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. రెండో స్థానంలో జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి, వీటితో 190 దేశాలకు యాక్సెస్ ఉంటుంది. 189 దేశాల వీసా ఫ్రీ యాక్సెస్‌తో డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ 6వ స్థానంలో ఉండగా అమెరికా 10వ స్థానానికి పడిపోయింది.
భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు భూటాన్, నేపాల్, మాల్దీవులు, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక (వీసా ఆన్ అరైవల్), ఫిజీ, మౌరిషస్, ఖజకిస్థాన్, జమైకా, కతార్, బార్బడోస్ వంటి దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లవచ్చు. అదేవిధంగా ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ ప్రాంతాల్లోని మరికొన్ని దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
2021లో భారత్ 90వ స్థానంలో ఉండి కనిష్ట ర్యాంక్ సాధించింది. 2006లో మాత్రం 71వ స్థానంలో నిలిచి అత్యుత్తమ స్థాయిని అందుకుంది. 2025లో బలహీనమైన పాస్‌పోర్ట్‌లలో ఆఫ్ఘానిస్తాన్‌ది చివరిది (99వ ర్యాంక్) కాగా, దీతో కేవలం 25 దేశాలకు మాత్రమే యాక్సెస్ ఉంది. సిరియా, ఇరాక్, పాకిస్తాన్, సోమాలియా, యెమెన్ పాస్‌పోర్ట్లు కూడా చివరి స్థానాల్లో ఉన్నాయి.
భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరగడం వల్ల పర్యాటకులు, వ్యాపారులు, విద్యార్థులు వంటి వారికి విదేశీ ప్రయాణం మరింత సులభం కానుంది. వీసా ప్రాసెస్ సులభతరం కావడంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే సంవత్సరాల్లో భారత్ ర్యాంక్ మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.