జీఎస్టీ 2.0 అన్నివర్గాలకు ఎంతో ప్రయోజనకరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అసెంబ్లీ వేదికగా అభినందనలు అన్నారు. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించి, జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ గొప్ప విధానానికి నాంది పలికారని, ఇప్పుడు మరిన్ని సంస్కరణలతో 2.0 తీసుకు రావడం అభినందనీయమని అన్నారు.
శాసన సభ సమావేశాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఎమ్మెల్యే వాసు జీఎస్టీ 2.0 అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు హర్షణీయమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారన్నారు. ఇది సామాన్యుడికి ఒక వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు జీఎస్టీ 2.0 ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయపడ్డారు. వేరు వేరు స్లాబ్స్ గా ఉండే దాన్ని రెండు స్లాబ్స్ గా మారుస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 ను కామన్ మాన్ జిఎస్టీగా ఆయన అభివర్ణించారు. అత్యంత అవసరమైన వస్తువులు,ఆరోగ్య, విద్య సంబంధిత వస్తువులకు జీరో రేటుకి తీసుకు రావడం, అదే సమయంలో లగ్జరీ గూడ్స్ కి పన్ను పెంచడం అభినందనీయమని అన్నారు.
ఇది విద్య వైద్య రంగాలకు ఎన్డీయే కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. కొత్త విధానం మార్కెట్ లో ప్రభావాన్ని చూపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయ పడ్డారు.ప్రధాని మోడీకి మధ్యతరగతి ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జీఎస్టీ విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ముందుకు వచ్చినప్పటికీ దేశంలో డేటా పాలసీ లోపల వలన నష్టపోతుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పెట్టుబడి దారులకు పన్ను మినహాయింపు కల్పించాలని సూచించడం ద్వారా సీఎం చంద్రబాబు విజన్ ని మనందరం గుర్తించుకోవాలని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచన ను కేంద్రం పరిగణనలోకి తీసుకుని సూపర్ ఛార్జ్ డేటా సెంటర్స్ కి 20ఏళ్ళు పన్ను మినహాయింపు, జీఎస్టీ క్రెడిట్ ఇచ్చే ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.