దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడటమే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (SBI Foundation) కొత్తగా ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 23,230 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎస్‌బీఐ ఫౌండేషన్ రూ.90 కోట్ల నిధులను కేటాయించింది. స్కూల్ విద్యార్థుల నుంచి అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటీ, ఐఐఎం మరియు విదేశీ విద్యార్థులు వరకు అందరూ ఈ పథకానికి అర్హులు కావచ్చు.
ఈ స్కాలర్‌షిప్‌కు 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు చదివే పేదింటి విద్యార్థులు అర్హులు. అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం సడలింపు కల్పిస్తూ 67.5% మార్కులు లేదా 6.3 సీజీపీఏ సాధించడం సరిపోతుంది. మరోవైపు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలకు మించకూడదు. ఈ నిబంధనలు పాటించే విద్యార్థులు నవంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్‌లో ఎంపికైన విద్యార్థులు చదువుతున్న కోర్సు పూర్తయ్యేంతవరకు వారికీ ఆర్థిక సాయం అందుతుంది. అందులో భాగంగా కోర్సు స్వభావాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు సాయం అందించనున్నారు. వైద్య, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ లేదా విదేశీ చదువుల కోసం అధిక మొత్తంలో ఆర్థిక సహాయం ఇవ్వగా, స్కూల్ లేదా అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తక్కువ మొత్తంలో స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇది పేద కుటుంబాలకు గణనీయమైన ఊరటనిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కసారి స్కాలర్‌షిప్ పొందడం సరిపోదు. ఎంపికైన విద్యార్థులు ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం అర్హత ప్రమాణాలు పాటించాలి. ఇందులో ముఖ్యంగా తగిన హాజరు, కనీస ఉత్తీర్ణత మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా నిజమైన ప్రతిభావంతులైన విద్యార్థులకే నిరంతర సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఎస్‌బీఐ ఫౌండేషన్ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. విద్యలో వెనుకబడిన ప్రతిభావంతులకు ఇది బంగారు అవకాశం అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.