ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంపై వేగం పెంచింది. దసరా పండుగ నాటికి లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు.
లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎస్సీ, బీసీ వర్గాలకు రూ.50 వేలు, ఎస్టీ వర్గానికి రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. దీంతో పేద కుటుంబాలు ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయగలిగే పరిస్థితి వచ్చింది. రూఫ్ కాస్ట్, లెవెలింగ్ పనులను త్వరగా ముగించేలా ప్రత్యేక దృష్టి పెట్టారు.
మరోవైపు, గృహనిర్మాణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా కొత్త లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల వరకు సాయం అందుతుంది. ఇందులో 60% కేంద్రం, 40% రాష్ట్రం వాటా ఉంటుంది. అలాగే ఇంటి స్థలాలు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.