ఈ నెల సెప్టెంబర్ 7-8 రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం జరగనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు, దీనినే “బ్లడ్ మూన్” అంటారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ సహా ప్రపంచ జనాభాలో సుమారు 77% మంది ఈ అద్భుత దృశ్యాన్ని చూడగలరు.

భారత కాలమానం ప్రకారం (IST) సెప్టెంబర్ 7 రాత్రి 10 గంటల నుంచి 1:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మొత్తం 82 నిమిషాల పాటు చంద్రుడు భూమి నీడలో పూర్తిగా కప్పబడిపోతాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇది కనిపిస్తుంది.
గ్రహణ సమయంలో చంద్రుడు భూమి ఉంబ్రా (గాఢ నీడ) లోకి వెళ్తాడు. అప్పుడు సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వంకర తిరిగి చంద్రుడిపై పడుతుంది. అందువల్ల చంద్రుడు ఎరుపు-నారింజ రంగులో కనిపిస్తాడు. ఈ రంగు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో చంద్రుడు ఆకాశంలో ఎత్తుగా ఉండే సమయంలో ఈ గ్రహణం జరగనుంది. కాబట్టి అక్కడి వారికి ఇది మరింత స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో మాత్రం చంద్రోదయ సమయానికే ఈ దృశ్యం కనిపిస్తుంది, అందువల్ల అద్భుతమైన హోరైజన్ వ్యూ దొరుకుతుంది.
చంద్రగ్రహణం చూసేందుకు ప్రత్యేక కళ్లజోడు, ఫిల్టర్ అవసరం లేదు. ఇది కళ్లతోనే సురక్షితంగా చూడవచ్చు. బైనాక్యులర్ లేదా చిన్న టెలిస్కోప్ వాడితే చంద్రుడు పై స్పష్టంగా కనిపిస్తుంది.