ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలంలో ఒక జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ షాపుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ దుకాణాల ఏర్పాటుకు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన యువత నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో షాపు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.8 లక్షల రుణం అవసరం అవుతుంది. అయితే అందులో రూ.4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. అంటే మిగిలిన రూ.4 లక్షలు మాత్రమే రుణంగా తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు చౌకగా మందులు అందించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే జనరిక్ షాపులు పనిచేస్తున్నాయి. వాటిని సీనియర్ సిటిజన్లు, మహిళా సంఘాల సభ్యులు, వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరింత విస్తృతంగా ఈ షాపులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్తగా జనరిక్ షాపుల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.