తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంది. కలియుగ దైవం వెంకన్నకు భక్తులు సమర్పించే కానుకలు, తలనీలాలు, దానాల వల్ల హుండీ ఆదాయం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది వేసవిలో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది. జూలైలోలాగే ఆగస్టులోనూ రోజుకు సగటున 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆగస్టు నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.123.43 కోట్లకు చేరింది. మొత్తం 23,15,330 మంది భక్తులు స్వామివారి దర్శనం పొందగా, 8,94,843 మంది తలనీలాలు సమర్పించారు. ఇందులో ఆగస్టు 19న హుండీ ఆదాయం అత్యధికంగా రూ.5.30 కోట్లకు చేరగా, ఆ రోజు 76,033 మంది భక్తులు దర్శనం పొందారు. అత్యల్ప ఆదాయం మాత్రం ఆగస్టు 27న రూ.3.06 కోట్లు మాత్రమే వచ్చింది.
మరోవైపు ఆగస్టు నెలలో అత్యధికంగా ఆగస్టు 16న 87,759 మంది భక్తులు దర్శించుకోగా, కనిష్టంగా ఆగస్టు 28న 63,843 మంది మాత్రమే స్వామివారి సేవలందుకున్నారు. మొత్తంగా ఆగస్టులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిటిడి అద్భుత సేవలు అందించింది. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ, వెంకన్న ఆదాయం కూడా కొత్త గరిష్టాలకు చేరుతోంది.