ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధానికి త్వరగా శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనడం అత్యవసరమని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
అలాగే భారత్–ఫ్రాన్స్ మధ్య ఉన్న వ్యూహాత్మక సహకారంపై కూడా నేతలు సమీక్ష జరిపారు. ఆర్థికం, రక్షణ, సైన్స్–టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. 'హారిజాన్ 2047', 'ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్', 'రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్' ఒప్పందాల ప్రకారం సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఈ సంభాషణ ఫలప్రదంగా సాగిందని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. "అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించాం. ప్రపంచ శాంతి, స్థిరత్వంలో భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. అలాగే, 2026 ఫిబ్రవరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు మాక్రాన్ హాజరుకానున్నారని మోదీ ధన్యవాదాలు తెలిపారు.