పండగ సీజన్ దగ్గర పడుతుండగా, కొత్త కార్లు కొనాలని చూస్తున్న వారికి రెనో ఇండియా శుభవార్త చెప్పింది. జీఎస్టీ 2.0 పన్ను విధానం అమల్లోకి రావడంతో వచ్చిన లాభాన్ని కస్టమర్లకు నేరుగా బదిలీ చేస్తూ, తన కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. దీంతో రెనో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్ల ధరలు గరిష్టంగా రూ.96,395 వరకు తగ్గాయి. తాజా ధరల ప్రకారం రెనో క్విడ్ ప్రారంభ ధర రూ.4,29,900 కాగా, ట్రైబర్, కైగర్ మోడళ్ల ప్రారంభ ధరలు రూ.5,76,300గా ఉన్నాయి.
ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి డెలివరీలకు వర్తిస్తాయని, అన్ని డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని సంస్థ ప్రకటించింది.రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ, “జీఎస్టీ 2.0 ప్రయోజనాన్ని వినియోగదారులకు నేరుగా అందించడం మా కట్టుబాటు. దీంతో మా కార్లు మరింత అందుబాటులోకి వస్తాయి. పండగ సీజన్‌లో డిమాండ్ కూడా పెరుగుతుంది” అని తెలిపారు.ఇదే సమయంలో టాటా మోటార్స్ కూడా ధరల తగ్గింపును ప్రకటించింది.
టియాగో ధర రూ.75,000 వరకు, నెక్సాన్ ధర రూ.1,55,000 వరకు తగ్గాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, త్వరలో మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.జీఎస్టీ 2.0 ప్రకారం, చిన్న కార్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ముందుగా అదనంగా ఉండే 1–22% సెస్ కూడా తొలగించబడింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5 శాతంగానే కొనసాగుతుంది.