
యూకే రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. దేశ హోం కార్యదర్శి (హోం సెక్రటరీ) పదవిని తొలిసారిగా ఒక ముస్లిం మహిళ చేపట్టారు. పాకిస్థాన్ మూలాలున్న షబానా మహమూద్ ఈ కీలక బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఈ పదవిలో నియమించారు. ఏంజెలా రేనర్ రాజీనామా తరువాత య్వెట్ కూపర్ స్థానంలో షబానా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకంతో దేశ అంతర్గత భద్రత, వలస విధానాలు, పోలీసింగ్ వంటి అత్యంత ముఖ్యమైన విభాగాలు ఆమె పరిధిలోకి వచ్చాయి.
షబానా మహమూద్ పాకిస్థాన్ నుంచి యూకేకు వలస వచ్చిన కుటుంబంలో 1980లో బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. చిన్ననాటి కొంతకాలం సౌదీ అరేబియాలో గడిపి, ఉన్నత విద్య కోసం తిరిగి యూకేకు వచ్చారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన ఆమె, కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు.
2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై, యూకే పార్లమెంటులో అడుగుపెట్టిన తొలితరం ముస్లిం మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించిన ఆమె, 2024లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయశాఖ కార్యదర్శిగా, లార్డ్ ఛాన్సలర్‌గా సేవలందించారు. ఆ హోదాలో జైళ్లలో రద్దీ తగ్గించడం, కేసులు త్వరగా పరిష్కరించడం వంటి సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు.