భూటాన్‌లో భారీ స్థాయి జలవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్, డ్రక్ గ్రీన్ పవర్ కంపెనీలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. శనివారం రెండు సంస్థలు రూ.6 వేల కోట్ల పెట్టుబడితో 570 మెగావాట్ల వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమానికి భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ టోబ్గే, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరయ్యారు.
BOOT (బిల్డ్–ఓన్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్) మోడల్‌లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విద్యుత్ ప్లాంట్‌తో పాటు సంబంధిత మౌలిక సదుపాయాలను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నివేదిక సిద్ధమై ఉండటంతో, 2026 తొలిార్ధంలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భూమిపూజ చేసిన ఐదేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదానీ పవర్ CEO ఎస్‌బి ఖ్యాలియా మాట్లాడుతూ – “ఈ ప్రాజెక్టు శీతాకాలంలో భూటాన్ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటుంది. వేసవిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తాం” అని తెలిపారు. మే 2025లో అదానీ గ్రూప్, డిజిపిసి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 5,000 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తిని అభివృద్ధి చేసే ప్రణాళికలో ఇది తొలి ప్రాజెక్టు కావడం విశేషం.
డిజిపిసి ప్రస్తుతం 2,500 మెగావాట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భూటాన్‌లో ఏకైక విద్యుత్ ఉత్పాదక సంస్థ. 2040 నాటికి 25,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో అది వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు జలవిద్యుత్‌కే పరిమితమైన ఈ సంస్థ, ఇప్పుడు సౌరశక్తి వైపు కూడా అడుగులు వేస్తోంది.