ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్ల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనర్హులు ఎక్కువమంది ఈ పింఛన్లు తీసుకుంటున్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాల్లో వైద్యులు వికలత్వ శాతం నిర్ధారించారు. పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత ఉన్నవారికి పింఛన్లు నిలిపివేస్తూ నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు అందుకున్న వారిలో 96% మంది అప్పీలు చేసుకున్నారు. దీంతో అప్పీలు చేసిన వారికి కూడా సెప్టెంబర్ నెల పింఛన్లు ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఈ క్రమంలో నకిలీ సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని కోరుతూ, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల సేవాసమితి ముఖ్యమంత్రికి అర్జీ సమర్పించింది. దీనిపై సీఎం కార్యాలయం స్పందించి, ఒక నెలలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక అప్పీలు చేసినవారిని మరోసారి స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారిని వృద్ధాప్య పింఛన్ల జాబితాలో చేర్చుతారు. రెండోసారి పునఃపరిశీలన తర్వాత కూడా నకిలీ అని తేలితే.. అలాంటి పింఛన్లను రద్దు చేస్తారు. అలాగే నకిలీ సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోనున్నట్లు సమాచారం.