ఎండలోనైనా, వానలోనైనా భూమి మీదే బతికే రైతు.. ఆరు కాలం కష్టపడి పంట పండిస్తాడు. కానీ పంట దుక్కి దున్నే నాటి నుంచి చేతికొచ్చే వరకూ రైతు జీవితం కష్టాల పంథానే. ప్రకృతి దెబ్బతీసినా, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా చివరికి నష్టపోయేది రైతే. అలాంటి రైతుకి అండగా నిలవడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పెట్టుబడి సహాయం నుంచి పంట కొనుగోళ్ల వరకూ రైతు కోసం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రైతు భూమి సారాన్ని పరీక్షించి సరైన ఎరువులు, మందులు వాడేందుకు భూ ఆరోగ్య కార్డులు అందిస్తోంది.
మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి డాక్టర్లు ఏటా పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు. పరీక్షల ద్వారా శరీరంలో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. అలాగే భూమికి కూడా సారపరీక్షలు చాలా అవసరం. భూసార పరీక్షల ద్వారా భూమిలో ఏ పోషకాలు ఎక్కువ, ఏవి తక్కువ అన్నది తెలుసుకోవచ్చు. ఆ వివరాల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు వేసి రైతులు మెరుగైన పంటలు పొందగలరని అధికారులు చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా భూసార పరీక్షలు సరిగ్గా జరగలేదనే విమర్శలు ఉండగా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖరీఫ్ సీజన్‌కు ముందు మిగిలిపోయిన నమూనాలను సేకరించి పరీక్షలు పూర్తి చేసింది. వాటి ఆధారంగా రైతులకు భూ ఆరోగ్య కార్డులు ఇస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు ఈ కార్డుల పంపిణీ జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు 2025–26 ఏడాదికి సంబంధించిన భూ ఆరోగ్య కార్డులు అందజేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.