భారతదేశంలో (India) ఒక దశలో ఆకలి, కరవు భయంకరంగా ప్రజలను అల్లాడించగా, అప్పుడు వెలుగురేఖగా మారారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఆయన కేవలం 30 ఏళ్ల వయసులోనే దేశ భవిష్యత్తును మారుస్తూ, కొత్త యుగానికి నాంది పలికారు. ఆకలి నివారణలో కీలక పాత్ర పోషించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
జపాన్, అమెరికా, మెక్సికో వంటి దేశాల శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై చేసిన పరిశోధనల ద్వారా ఆయన దేశ వ్యవసాయ రంగానికి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ఫలితంగా రైతు జీవితం మారింది, దేశం ఆకలితో విలవిల్లాడే పరిస్థితి నుండి బయటపడింది.
స్వామినాథన్ సూచనల మేరకు రైతులు అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను వాడడం మొదలుపెట్టారు. రైతులకు శిక్షణ, పద్ధతుల మార్పుతో దేశం ముందుకు సాగింది. అప్పటి వరకూ విదేశాలనుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే భారత్, తరువాతి రోజుల్లో వాటిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇది ఆయన చూపిన మార్గం వల్లే సాధ్యమైంది.
ఈరోజు, ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఆహార భద్రత, వ్యవసాయ రంగానికి నూతన దిశనిచ్చిన స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు దేశ అభివృద్ధికి ఎలా మార్గదర్శకులవుతారో ఈ సందర్భం మనకు గుర్తు చేస్తోంది.