ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ షాపుల ద్వారా కిలో ఉల్లిపాయలు కేవలం రూ.14కే అందుబాటులోకి రానున్నాయి. మొదటగా కర్నూలు జిల్లాలో ఈ పథకం ప్రారంభమైంది. కర్నూలు నగరంలోని 170 రేషన్ షాపుల్లో ఉల్లిపాయల విక్రయం ఇప్పటికే మొదలైంది. త్వరలోనే అన్ని జిల్లాలకు ఈ సదుపాయం విస్తరించనుంది. రేషన్ కార్డు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉల్లి రైతులకు మద్దతు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కర్నూలు మార్కెట్‌లో మద్దతు ధరకు కొనుగోలు చేసిన ఉల్లిపాయలను రైతు బజార్లు, హాస్టల్స్, అన్న క్యాంటీన్లు, మధ్యాహ్న భోజన పథకాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఒకవైపు రైతులకు న్యాయం జరుగుతుండగా, మరోవైపు వినియోగదారులకు తక్కువ ధరలో మంచి నాణ్యత గల ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇక మరోవైపు ఎరువుల కొరతపై వస్తున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావాలని గందరగోళం సృష్టించే వారిని జైలుకు పంపుతామని సీఎం స్పష్టం చేశారు.