పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే చారిత్రక గ్లోరియా ఫ్యూనిక్యులర్ (కేబుల్ రైలు) పట్టాలు తప్పి బోల్తా కొట్టింది. ఈ విషాదకర ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం అవెనిడా డా లిబర్డేడ్ సమీపం. ప్రమాద తీవ్రతకు రైలు నుజ్జునుజ్జయింది. వెంటనే సహాయక సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా సంతాపంగా రాబోయే పుస్తక మహోత్సవాన్ని రద్దు చేశారు. గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. లిస్బన్ మేయర్ కార్లోస్ మోదాస్ ఈ రోజును నగర చరిత్రలో అత్యంత బాధాకరమైన రోజుగా పేర్కొన్నారు. స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ దుర్ఘటనపై ప్రపంచ నాయకులు సంతాపం ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అమెరికా రాయబార కార్యాలయం కూడా సంఘీభావం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018లో కూడా ఇదే ఫ్యూనిక్యులర్ పట్టాలు తప్పినప్పటికీ, అప్పట్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈసారి భారీ ప్రాణనష్టం జరగడం దేశానికే విషాదాన్ని మిగిల్చింది.