తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌కు విమాన సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వారానికి మూడు సార్లు ఈ ఫ్లైట్ నడుస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల నుంచి యూరప్ ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది.
భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్‌ఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి సర్వీసులు నడుపుతున్న కేఎల్‌ఎం.. హైదరాబాద్‌ను నాలుగో గేట్‌వేగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి వారానికి 24 విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు నడుపుతున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్యను 27కి పెంచనున్నట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ వెల్లడించారు.
హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాలకు కీలక కేంద్రమని, ఇక్కడి నుంచి సరుకు రవాణాకు కూడా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను ఉపయోగిస్తున్నామని, వీటిలో 288 మంది ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కొత్త సర్వీసు వ్యాపారం, పర్యాటకం, అంతర్జాతీయ కనెక్టివిటీకి ఊతమిస్తుందని ఆశిస్తున్నారు.