బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు టీఎస్ఆర్‌టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పండుగల సందర్భంలో 7,754 ప్రత్యేక బస్సుల నిర్వహణ కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో 377 ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు నడిపించబడతాయి. ముఖ్యంగా బతుకమ్మ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న, దసరా అక్టోబర్ 2న జరుగుతుండడంతో పండుగకు ముందు, పండుగ సమయంలో మరియు తరువాత రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక బస్సులు సౌకర్యవంతంగా అందించబడతాయి.
హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు, కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సర్వీసులు అందిస్తాయి. ఈ ప్రత్యేక సర్వీసులు కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే కాక, రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల వైపుకు కూడా వెళ్లనుండగా, పండుగల సందర్భంలో ప్రయాణికులకి సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
పండుగల రోజుల్లో ప్రత్యేక బస్సుల టిక్కెట్ ధరల్లో కొన్ని సవరణలు కూడా ఉంటాయి. ఈ దసరా స్పెషల్ బస్సులలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం, తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు సవరించబడతాయి. సెప్టెంబర్ 20, 27 నుంచి 30, అలాగే అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే ప్రత్యేక బస్సులలో మాత్రమే ఈ సవరణ అమల్లో ఉంటుందని, ఇతర రెగ్యులర్ సర్వీసుల ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.
గత సంవత్సరం కంటే 617 అదనపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రవాణా సౌకర్యాన్ని మరింత పెంచారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాంప్‌లను ఏర్పాటు చేసి, షామియానాలు, కూర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు. పర్యవేక్షణాధికారులను నియమించి, రవాణా, పోలీస్, మున్సిపల్ శాఖలతో సమన్వయం సాధిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. పండుగ సందర్భంగా వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడరాదు అని, టీఎస్ఆర్‌టీసీ అనుభవజ్ఞులైన డ్రైవర్లతో సురక్షితంగా ప్రయాణం అందిస్తుందని MD VC సజ్జనర్ వెల్లడించారు. ముందస్తు రిజర్వేషన్లు tgsrtcbus.in లో చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 040-69440000, 040-23450033లో సంప్రదించాలని సూచించారు.