ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, రసాయనాల పిచికారీ కోసం రాయితీపై డ్రోన్లు అందించనుంది. డీఆర్‌డీఏ అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు కాగా, 80% సబ్సిడీతో కేవలం రూ.2 లక్షలకే మహిళలకు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని స్త్రీనిధి లేదా వీవో నుంచి రుణంగా పొందవచ్చు.
కేంద్రం ఎంపిక చేసిన డీహెచ్-ఏజీ-ఈ10 రకం డ్రోన్లు ఏపీకి రానున్నాయి. వీటి బరువు 15 కిలోల లోపే ఉండి, బ్యాటరీతో నడుస్తాయి. సులువుగా మోసుకెళ్లే వీలున్న ఈ డ్రోన్లు రైతులకు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో కూడా ఉపయోగపడతాయి. మాన్యువల్‌గా రసాయనాలు పిచికారీ చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇక ఉండవు. డ్రోన్లతో కేవలం అవసరమైన చోటకే మందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు తగ్గి, రసాయనాల వినియోగం 10% వరకు తగ్గుతుంది.
ఒక ఎకరా పొలానికి డ్రోన్లతో 5–7 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు ఎకరానికి రూ.500 వసూలు చేస్తున్నాయి. రోజుకు 8 గంటల వరకు డ్రోన్లు ఉపయోగించవచ్చు.
మహిళల పాత్రను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన మహిళలకు 15 రోజుల డ్రోన్ ఆపరేటర్ శిక్షణ, వారి కుటుంబ సభ్యులకు 5 రోజుల డ్రోన్ మెకానిక్ శిక్షణ ఇస్తారు. దీంతో మరమ్మతులు కూడా తామే చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అధికారులు డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.