ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు పే ఫోన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 110 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో ఒక్కొక్కటికి ఆరు పే ఫోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రొద్దం గురుకుల పాఠశాలలో సోమవారం ఈ ప్రాజెక్టును బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ప్రారంభించనున్నారు.
ఈ గురుకుల పాఠశాలల్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండటం వల్ల కొంతమంది విద్యార్థులు ఇంటి మీద మమకారం, బెంగతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం పే ఫోన్ ఆలోచనను తీసుకొచ్చింది. రోజుకు రెండు గంటల సమయం – ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట – విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేలా అవకాశం కల్పించారు. స్కూలు సౌకర్యాన్ని బట్టి ఈ సమయాన్ని మారుస్తారని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇస్తారు. వీటిని రీచార్జ్ చేసుకుని ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు సూచించిన నాలుగు నంబర్లకే కాల్ చేసే వెసులుబాటు ఉంటుంది. దుర్వినియోగం జరగకుండా ప్రతి పే ఫోన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో విద్యార్థులు కుటుంబంపై ఉన్న ఆందోళన తగ్గించి, చదువుపై మరింత దృష్టి పెట్టగలరని ప్రభుత్వం నమ్ముతోంది.