విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. మెట్రో నిర్మాణానికి పిలిచిన టెండర్ల గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విజయవాడ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 14 వరకు, విశాఖ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించారు.
ఈ ప్రాజెక్టుల ఫస్ట్ ఫేజ్ పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశలోనే మొత్తం రూ.21,616 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఇందులో కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులు సమకూర్చగా.. మిగిలిన 60 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా పొందనున్నారు. తక్కువ వడ్డీ రుణాల కోసం కేంద్రం ప్రత్యేకంగా సహకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను విశాఖ నగరపాలక సంస్థ, సీఆర్డీఏ సమకూర్చనున్నాయి.
విశాఖ మెట్రో రైల్ ఫేజ్-1లో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో నిర్మాణం జరగనుంది. ఇందులో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గం ఉంటుంది. ఇక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌లో 38.40 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మాణం చేపడతారు. ఇందులో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఉండనుంది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు పూర్తవుతే ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.