ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి క్వాంటం టెక్నాలజీస్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) అభివృద్ధి కోసం అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ నియమితులయ్యారు. అపెక్స్ కమిటీలో 14 మంది, ఎక్స్‌పర్ట్ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వీరిలో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఇస్రో, సీఎస్ఐఆర్, సీడీఏసీతో పాటు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఏడబ్ల్యూఎస్, ఎన్విడియా వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేస్తూ, అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యక్రమాలకు మార్గదర్శనం, సాంకేతిక పర్యవేక్షణ అందిస్తాయి. ఈ మేరకు కమిటీల పాత్ర, బాధ్యతలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఉత్తర్వులు జారీ చేశారు.