దేశంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 8న రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు.
రైల్వే ప్రయాణికులు ఇప్పటికే 4జీ, 5జీ వంటి మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. వీటికి తోడు, రైల్‌టెల్ సంస్థ ‘రైల్‌వైర్’ పేరుతో ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. ఈ సౌకర్యం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది.
ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ‘రైల్‌వైర్’ నెట్‌వర్క్ ఎంచుకుని, మొబైల్ నంబర్ నమోదు చేసి, అందుకున్న ఓటీపీ ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు. దీనివల్ల వారు స్టేషన్‌లో ఆన్‌లైన్ పనులు చేయగలుగుతారు, వీడియోలు చూడగలుగుతారు.