జపాన్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు తిరగబోతోంది. ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యం కొనసాగిన జపాన్ ప్రధాని పీఠాన్ని తొలిసారి ఒక మహిళ అధిరోహించనున్నారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (LDP) తరపున సనై తకైచిను అధికారికంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో జపాన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాయబడబోతోంది.
ఇటీవల అధికార పార్టీ అంతర్గత విభేదాలు పెరిగిన నేపథ్యంలో, మాజీ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయడంతో, పార్టీ కొత్త అధ్యక్షురాలిగా తకైచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితంతో ఆమె ప్రధానమంత్రి పీఠానికి దారి సుగమమైంది. పార్టీ మెజారిటీ కలిగి ఉండటంతో, తకైచి కొత్త ప్రధాని కావటానికి మార్గం సుగుమం అయింది
తకైచి జపాన్‌లో ఐరన్ లేడీగా పిలవబడుతున్నారు. ఆమె కఠినమైన నిర్ణయాలు, దృఢమైన వైఖరి, దేశ భద్రతపై చూపే పట్టుదలతో ఈ బిరుదు సంపాదించారు. కన్సర్వేటివ్ విధానాలను గట్టిగా సమర్థించే తకైచి, జపాన్ రక్షణ సామర్థ్యాలను పెంచేందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడంలో ఆమె దృఢమైన విధానాలను అనుసరించనున్నారని భావిస్తున్నారు.
ఆర్థిక రంగంలో కూడా తకైచి సరికొత్త దిశగా అడుగులు వేస్తారని అంచనాలు ఉన్నాయి. జపాన్ ఇప్పటికే వృద్ధాప్య జనాభా, ఆర్థిక మందగమనం, గ్లోబల్ సవాళ్లతో పోరాడుతున్న సమయంలో, తకైచి సంస్కరణలు, సాంకేతికతను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాల ప్రభావం ఇప్పటికే జపాన్ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. తకైచి పేరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్‌లో సూచీలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇన్వెస్టర్లు ఆమె నాయకత్వాన్ని ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ రాజకీయాల్లో ఇది ఒక అరుదైన మలుపు. రైట్‌వింగ్ నాయకురాలు దేశ అత్యున్నత పదవిని చేపట్టబోతుండటం విశేషమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జపాన్ సమాజంలో మహిళల పాత్రపై ఇంతవరకు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, తకైచి విజయంతో ఆ దృక్పథంలో పెద్ద మార్పు చోటు చేసుకోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తకైచి ప్రధానంగా రక్షణ, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశముంది. ముఖ్యంగా అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆసియా ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం ఆమె ప్రధాన లక్ష్యాలుగా ఉండబోతున్నాయి.
మొత్తం మీద, సనై తకైచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం కేవలం జపాన్‌కే కాకుండా, ప్రపంచ రాజకీయాలకు కూడా ఒక గమనించదగ్గ పరిణామం. దేశ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ప్రధానమంత్రి అవడం ద్వారా జపాన్ సమాజంలో కొత్త చైతన్యం రానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆమె ఎన్నికల ప్రభావంతో ఆర్థిక రంగం కూడా పాజిటివ్ దిశగా పయనిస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.