బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 లోపు పూర్తవుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. అదే రోజు ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ను, అక్టోబర్ చివరలో జరిగే ఛఠ్ పూజా పండగ అనంతరం వెంటనే ఎన్నికలు జరపాలని కోరాయి. ఎందుకంటే ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న వేలాది మంది ప్రజలు తమ ఊళ్లకు తిరిగి వస్తారు. వారు కూడా ఓటు వేయగలిగేలా అవకాశం ఉంటుందని పార్టీలు అభిప్రాయపడ్డాయి.
జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశ ఓటర్లందరికీ అభినందనలు. బీహార్ ప్రజలందరినీ ప్రజాస్వామ్య పండుగను, మీరు ఛఠ్‌ను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారో, అదే ఉత్సాహంతో జరుపుకోమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ భాగస్వామ్యం నిర్ధారించాలి అన్నారు.
ఓటింగ్ కేంద్రాల సంఖ్య గురించి మాట్లాడుతూ ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా బ్యాలెట్ పత్రాల్లో సీరియల్ నంబర్లు, అభ్యర్థుల ఫోటోలు ఇకపై బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా కలర్‌లో ఉంటాయని తెలిపారు.

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన విమర్శలకు జ్ఞానేశ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రతి ఎన్నిక ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరిగా చేయాల్సిందేనని, ఎన్నికల తర్వాత సమీక్ష చేయడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఈసారి బీహార్ ఎన్నికల్లో ముఖ్యంగా రెండు కూటముల మధ్యనే పోరు ఉండనుంది. అధికార ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) తరపున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ను ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) నేతృత్వం వహిస్తోంది.
ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ వద్ద 131 సీట్లు ఉన్నాయి. వీటిలో బీజేపీకి 80, జేడీయూ (జనతాదళ్ యునైటెడ్)కి 45, హెచ్‌ఏఎం(S) పార్టీకి 4, స్వతంత్రులకు 2 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షం వద్ద 111 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆర్జేడీకి 77, కాంగ్రెస్‌కు 19, సీపీఐ(ఎంఎల్)కు 11, సీపీఐ(ఎం)కు 2, సీపీఐకి 2 సీట్లు ఉన్నాయి.
ప్రస్తుతం బీహార్ లో ఇరు కూటములు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. చూడాలి మరి బీహార్ లో ఏ పార్టీని ప్రజలను మన్నలను పొందుతుందో తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.