ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మరియు ప్రజల అనుకూలంగా మార్చే దిశగా 17 ప్రధాన మార్పులను ప్రకటించింది. ఈ సంస్కరణలను మొదటగా బిహార్ ఎన్నికల్లో అమలు చేయనున్నారు. వీటితో ఓటర్లకు ఓటు వేయడం సులభతరం అవుతుందని, అలాగే ఎన్నికల ప్రక్రియలో నమ్మకం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ మార్పులలో ఓటర్ల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు ఉన్నాయి. ఇకపై ఓటరుగా రిజిస్టర్ అయిన 15 రోజుల్లో ఓటర్ కార్డు ఇంటికే చేరుతుంది. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ఓటర్లు ఫోన్లను భద్రంగా ఉంచే సౌకర్యం కల్పించనున్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1500 నుండి 1200కి తగ్గించారు. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, పెద్ద అక్షరాలతో పేర్లు కనిపించేలా మార్పు చేశారు.
పారదర్శకత కోసం వెబ్ కాస్టింగ్‌ను తప్పనిసరి చేశారు. ప్రతి బూత్‌లో 100% వెబ్ కాస్టింగ్ ఉండగా, బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బూత్ ఓట్ల లెక్కింపులో ఏదైనా తేడాలు ఉంటే, అక్కడి VVPATలను కూడా లెక్కిస్తారు. అలాగే BLOలు, వారి సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ సమయంలో శాంతి భద్రతల నిర్వహణపై పోలీసులకు ప్రత్యేక సెషన్లు కూడా ఉంటాయి.
ఇకపోతే సిబ్బందికి మరియు ఓటర్లకు సౌకర్యం కల్పించేందుకు పలు మార్పులు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇచ్చే రెమ్యూనరేషన్ పెంచారు. పోలింగ్ స్టేషన్ సులభంగా గుర్తించేందుకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్‌ను రీడిజైన్ చేస్తున్నారు. అదేవిధంగా అక్రమ ఓటర్లను తొలగించేందుకు SIR పద్ధతిని అమలు చేయనున్నారు. అలాగే ఎన్నికల కమిషన్‌లో ఉన్న 40 వేర్వేరు ప్లాట్ఫాంలను కలిపి, ECINET అనే ఒకే సింగిల్ డెస్టినేషన్‌గా మార్చనున్నారు.
లెక్కింపు ప్రక్రియలోనూ మార్పులు చేశారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే EVM లెక్కింపు ప్రారంభం అయ్యేది. ఇకపై మొదటగా EVM లెక్కింపు జరగనుంది. చివరి రెండు రౌండ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. అంతేకాకుండా ఎన్నికల తర్వాత ఎన్ని మంది ఓటేశారు, అందులో పురుషులు, మహిళలు, ఇతరులు ఎంతమంది ఉన్నారనే వివరాలను డిజిటల్ ఇండెక్స్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ మార్పులతో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతంగా, విశ్వసనీయంగా మారనుందని భావిస్తున్నారు.