ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దొనకొండ కీలక రక్షణ ప్రాజెక్టుకు వేదిక కానుంది. తాజా సమాచారం ప్రకారం, దొనకొండలో డీఆర్డీవో (DRDO - డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో క్షిపణి తయారీ కేంద్రం స్థాపనకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇటీవల దొనకొండ (Donakonda) ను సందర్శించింది. ప్రాజెక్టు స్థల ఎంపిక కోసం అక్కడి ప్రభుత్వ భూములను, సరిహద్దులను, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించింది. బ్రిటిష్ (British) కాలం నాటి ఇప్పుడు పాడైపోయిన ఎయిర్‌పోర్టును కూడా వారు పరిశీలించినట్లు సమాచారం.
ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, భద్రతా పరంగా అవసరమైన చర్యలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.
ఈ కేంద్రం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం తోపాటు, దొనకొండ ప్రాంతానికి సమృద్ధి తీసుకొచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.