ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడి చేసింది. అయితే ఈసారి దాడి స్థాయి చూసి ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఏకంగా 800 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా అర్ధరాత్రి దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఆకాశం మొత్తాన్ని డ్రోన్లు కప్పేశాయి. క్షణక్షణం బాంబులు పేలుతుండగా, మిస్సైళ్లు గగనతలంలో విస్ఫోటనమవుతూ ప్రజల హృదయాల్లో భయానక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉక్రెయిన్ క్యాబినెట్ మినిస్టర్స్ భవంతిపై నేరుగా దాడి జరగడం అక్కడ పరిస్థితిని మరింత విషమం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి.
రష్యా ఈ స్థాయిలో డ్రోన్లతో దాడి చేయడం పట్ల ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే యుద్ధంతో విసిగిపోయిన యూరప్ ఇప్పుడు ఈ దాడిని గంభీరంగా చూస్తోంది. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఈ ఘటనపై అత్యవసర సమావేశాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. “ఇది కేవలం ఉక్రెయిన్ సమస్య మాత్రమే కాదు, యూరప్ భద్రతకూ ముప్పు” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీవ్ వీధుల్లో ఆందోళనకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు కుటుంబాలు రాత్రంతా బంకర్లలో తలదాచుకున్నాయి. వృద్ధులు, పిల్లలు ఆ క్షణాల్లో ఎదుర్కొన్న భయాన్ని వర్ణించలేము.
ఉక్రెయిన్ సైన్యం కూడా సమర్థంగా ఎదుర్కొనడానికి ప్రయత్నించింది. డ్రోన్లలో దాదాపు 500ను కూల్చేశామని రక్షణ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ మిగిలిన డ్రోన్లు, మిస్సైళ్లు కొన్ని లక్ష్యాలను దాటేసి నష్టాన్ని కలిగించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండకూడదు” అని పిలుపునిచ్చారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా ఈ దాడితో రెండు సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది: ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించడం ప్రపంచానికి తమ శక్తి ప్రదర్శన చేయడం ప్రస్తుతానికి అమెరికా, నాటో మద్దతుతో ఉక్రెయిన్ నిలబడి ఉన్నా, ఇలాంటి వరుస దాడులు యుద్ధాన్ని మరింత దీర్ఘకాలికం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే రెండేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవైపు పాశ్చాత్య దేశాల మద్దతు, మరోవైపు రష్యా బలమైన దాడులు – ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది ఉక్రెయిన్ ప్రజలు. 800 డ్రోన్ల దాడి తర్వాత భవిష్యత్తులో మరింత విపరీత దాడులు జరుగుతాయనే భయం అక్కడి ప్రజలను వెంటాడుతోంది.
ఈ అర్ధరాత్రి దాడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరో తీవ్రమైన మలుపు తీసుకొచ్చింది. అంతర్జాతీయ ఒత్తిడులు పెరిగినా, యుద్ధం తగ్గే సూచనలు కనబడడం లేదు. కీవ్ వీధుల్లోని నిరాశ్రయుల కేకలు, పేలుళ్ల శబ్దాలు, ప్రజల నిరంతర భయం – ఇవన్నీ ఈ యుద్ధం మానవతకు కలిగిస్తున్న అమానుష దృశ్యాలను మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాయి.