పండగ సీజన్‌కు ముందే సొంత వాహనం కొనాలని యోచిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించబోతోంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందడుగు వేసింది. దీపావళి సీజన్‌కు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామన్న ప్రచారంతో, పన్ను తగ్గింపు సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నాలుగు శ్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు శ్లాబులకు పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగనుండగా, ఈ ప్రతిపాదన సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయానికి రానుంది. 28 శాతం జీఎస్టీలో ఉండే అనేక వస్తువులు, ముఖ్యంగా మాస్ మార్కెట్ కార్లు, బైకులు, 18 శాతం శ్లాబులోకి వస్తాయి. లగ్జరీ కార్లపై ప్రత్యేక పన్ను విధించేందుకు 40 శాతం శ్లాబు పరిశీలనలో ఉంది.
ఇక ఎంట్రీ-లెవెల్ కార్లు, బైకుల అమ్మకాలు గత కొన్ని సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, అధిక వడ్డీ రేట్లు ప్రధాన కారణాలు. జీఎస్టీ తగ్గింపు వార్తలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక్కరోజే 4.61 శాతం లాభపడ్డట్లు గమనార్హం. ప్రధాన మంత్రి మోదీ “రెగ్యులర్ వాడకానికి వస్తువుల ధరలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం అందించడం” అని తెలిపారు.