ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించే వేడుకలో మంత్రులంతా తప్పకుండా పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే ముందు ఆటో డ్రైవర్లతో ముఖాముఖీ చర్చించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా సూచించగా, సీఎం చంద్రబాబు దానిని స్వీకరించి, అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.
కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు వివిధ రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. గత వైసీపీ పాలనలో సింగపూర్ ప్రభుత్వం ఏపీపై విశ్వాసం కోల్పోయిందని, ఇప్పుడు మళ్లీ ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వం తొందరపడలేదని తెలిపారు. అంతేకాక, వైసీపీ హయాంలో అక్కడి మంత్రులను బెదిరించిన ఘటనలు సింగపూర్ ప్రభుత్వాన్ని భయపెట్టినట్లు చెప్పారు.
ఇక, రాష్ట్ర కేబినెట్ కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ... కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్‌లను బినామీలు నిర్వహించేందుకు వస్తే సహించబోమని స్పష్టం చేశారు.