భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆయన ఈ వివరాలను తెలిపారు.
74,000 రైల్వే కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 11,535 కోచ్‌లలో సీసీ కెమెరాలు అమర్చినట్లు పేర్కొన్నారు. ప్రతి కోచ్‌లో రెండు ప్రవేశద్వారాల వద్ద నాలుగు కెమెరాలు, ప్రతి ఇంజిన్‌లో ఆరు కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంజిన్ ముందు, వెనుక, రెండు పక్కలతో పాటు రెండు క్యాబిన్‌లలో కెమెరాలు అమరవుతాయని వివరించారు. వీటితో పాటు రెండు డెస్క్ మౌంట్ మైక్రోఫోన్‌లు కూడా ఉంటాయని తెలిపారు.
ఈ కెమెరాలు అన్ని స్టాండర్డ్ టెస్టింగ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (STQC) మరియు RDSO ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే రైళ్లలోనూ ఈ కెమెరాలు స్పష్టమైన వీడియో ఫుటేజ్ అందిస్తాయని తెలిపారు. కెమెరాలను కోచ్‌లలోని ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే అమర్చడం వల్ల ప్రయాణికుల గోప్యతకు భంగం కలగదని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం — రైళ్లలో జరిగే దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, విధ్వంసాలను నిరోధించడమేనని చెప్పారు. అవసరమైనప్పుడు నేర దర్యాప్తులో ఈ ఫుటేజ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థను రియల్ టైమ్ మానిటరింగ్, కృత్రిమ మేధ (AI) ఆధారంగా మరింత మెరుగుపర్చే దిశగా కృషి చేస్తామన్నారు.
ఇక, మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి పేర్కొంటూ.. తక్కువ మరియు మధ్యతరగతి ఆదాయవర్గాల ప్రయాణికుల కోసం రానున్న ఐదేళ్లలో 17,000 నాన్-ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1,250 జనరల్ కోచ్‌లను సుదూర రైళ్లలో చేర్చామని గుర్తుచేశారు.